కవితాశక్తి
ఒక కవిత కి ఉండే పొగరుండాలి మనందరికీ
పడుంటుందేమో మడిచిన పుస్తకాల
వరుసలలో అటకలమీద ఎక్కడో ఎన్నాళ్ళో ఒక కాగితాల కట్టగా
కానీ
తన భావాన్ని చూడగలిగే కంట పడితే
ఆ కంటికి అర్ధం చేసుకునే మేధస్సు ఆచరించగలిగే మనసుంటే
ప్రపంచాన్ని శాసించగలదు
మేఘానికి తెలియదు తనకు పుట్టిన చినుకులు ఎక్కడికి పోతాయో ఏమవుతాయో
కవి కి తెలియదు తన కవితాఝరి ఏ మొలక మనసుల
భావాల వేరులకు ప్రాణమవుతుందో
భాష నేర్చి భావాలు కూర్చీ
పదాలను ఏర్చి అందంగా పేర్చిన ఒక కవి హృదయాంతరంగం లో
ఉంది
ప్రపంచాన్ని మార్చేయగల శక్తి
బలహీనులకు బలాన్నిచ్చే భుక్తి
మేధస్సుకు పదునిచ్చే యుక్తి
సత్యాన్వేషి కి ముక్తి
అందుకే
ఒక కవిత కి ఉండే పొగరుండాలి మనందరికీ
పుట్టుకా చావు అనే అట్టగోడల మధ్య
జీతాలు జనాలు జనారణ్యాల కాగితాల మధ్య
ఆ చిరు కవితలాగే ఇరుక్కుని దాగుంటుంది నీ మనసు
తెరిచి చూడు ఏముందో
నీ హృదయాంతరాళం లో
చదివి చూడు నీ మనోభావం
ఎం చెప్తోందో
తెలుసుకో
నీ జీవితానికి అది ఎం అర్ధం ఇస్తుందో
సాగిపో ఇప్పుడే
నీ దగ్గర సమయం ఉందో లేదో
చాటిచెప్పు ప్రపంచానికి
నువ్వెంటో
లే.. పద..
👌👌👌KMV
ReplyDelete