Featured post

The Tryst

He strode quickly Through the Bush,by the tree, over pebble and dead wood.. Bending twisting and breaking, his path was no good All a sma...

Monday, 4 May 2020

నవయుగ బానిసత్వం



వేడిలో వుక్కతో బరువులెత్తే పని కాదు
చెమట నెత్తురు చిందించాల్సిన అవసరం లేదు

రాళ్ళ మధ్యన తవ్విన చీకటి గని కాదది
చలువరాతి మేడలలో కాంతులీనే గది

చిరిగిన బట్టలు నెత్తిన తట్టలు లేవు
రోజు కూలి కోసం పడిగాపులు ఉండవు

ఒకడి కష్టం అందరూ పంచుకునే సఖ్యత ఉండదు
ఒక మాట పై అందరూ నిలబడే ఐక్యత కనపడదు

వెట్టిచాకిరి కి వానిటీ(Vanity) సాంగత్యం
కొత్త బట్టలేసుకొచ్చింది అదే పాత బానిసత్వం

కార్పొరేటు కొండచిలువల తెలివైన లూఠీ
చదువెక్కిన గానుగెద్దులకు ప్రోడక్టివిటీ పోటీ

రాబందు రెక్కల నీడన అంతబాగుందనుకుంటూ
ఇదిగాక మరేదీ చేతకాదనుకుంటూ

అన్యాయాన్ని మౌనంగానే భరిస్తూ
వినమ్రత లో నీ స్వేచ్ఛను నీవే హరిస్తూ

కాలరు రంగు మారిన కార్మికుడా
కార్పొరేటు ముసుగు చాటు శ్రామికుడా
సాకాహారి ని సింహం తినదనుకునే అమాయకుడా
శ్రమదోపిడిని ఎదిరించలేని సైనికుడా

తలవంచుకు బతికేస్తావా
తిరగబడి ఎదిరిస్తావా

Wednesday, 18 March 2020

వర్షం





అగాధాలా?
ఆకాశహర్మ్యాలా?
అగ్నిపర్వతాలా
ఆవిరి బొంతల దొంతులా?
కాదేమో?
ఇంకేదో ఉందేమో?
తల్లి వలె ఆకాశం
పుడమికి పాలిస్తూ 
పదాలు లేని భాషలో 
అర్ధాలకందని భావాలతో
పాడిన ఉరుముల జోలపాటకు 
గాలి వేణువు రాగమై
అందమైన కధల మబ్బులు కదిలి
చిటపట చినుకు కవితలై కురియగా
కమ్ముకొచ్చిన నిద్ర చీకటై 
కవిహృదయం కన్నువాల్చే
మనసు నిండిన నభజనని మందహాసము మెరుపై మెరిసే

Thursday, 5 March 2020

అదే ప్రపంచం..




ఆదర్శాల ఆకలి కేకలు తూర్పున వినపడుతున్నాయి
నీతులు త్రేన్చే ముసుగు నిజాలు పస్చిమాన కనపడుతున్నాయి

గుంటనక్కల నాయకత్వం లో పిచ్చికుక్కలు మొరుగుతున్నాయి
చలిచీమలు పొట్ట చేతబట్టుకు భయంగా పరిగెడుతున్నాయి

అమాయకపు అడవిని నాగరికత ముంచేస్తోంది
సతత హరిత వనాలను డబ్బు నిప్పు కాల్చేస్తోంది

హిమశిఖరాగ్రం పై వేడి గాలి వీస్తోంది
గొంతెండిన జీవనది మెల్లగా ఆవిరౌతోంది

ఇమడలేక భూగోళం వెర్రిగా తిరుగుతోంది
నేతల కొత్త గీతల తో ప్రపంచపటం చిరుగుతోంది

గుడ్డి న్యాయదేవత గొంతు పై కత్తి గాటు పెట్టింది
దారి దొంగల నిలువుదోపిడి బాటసారిని భయపెట్టింది

మరో ప్రపంచపు వెతుకులాటలో ఆశయం అలిసిపోయింది
గుడ్డ మూటల దాచిన ధైర్యం కరిగి నీరై కారిపోయింది 

మనిషి పోటు కి మానవత్వం వెన్నువిరిగి చచ్చింది
మొండి నిద్ర నుండి మెదడు మెలకువలోకొచ్చింది

మరో ప్రపంచం ఆదర్శధామం ఊహాజనితమని చెప్పింది
చెమర్చిన కళ్లు తుడిచి ప్రపంచం సాయమడిగింది

నువ్వు బ్రతుకుతున్న ప్రపంచం సరిచేయమని ఆదేశించింది
కవి కంట నీరు తొణికి కలమంచున కవితయింది

Saturday, 8 February 2020

బాటల మాటలు




కష్టాల ముల్ల కంపలు కదలనివ్వమంటున్నాయి 

నోళ్ళు విసిరే వడగాళ్లు మొఖాన మట్టి కొడుతున్నాయి 

వేడి లేని చలువరాతి దార్లు వెనక్కి రమ్మంటున్నాయి 

ఆకలితో బాధ్యతలు భోరుమంటున్నాయి

అవమానాల అడ్డంకులు అపహసిస్తున్నాయి

గుండెధైర్యం గాడితప్పి గాలిలోకలిసిపోతోంది

దెయ్యాల మర్రిలా భయం ఊడలు చాచి ఉరేస్తానంటోది 

ఓటమి వద్దని వారిస్తోంది

ఒక్క నిముషమాలోచించమని వివేకం కూడా వాదిస్తోంది 


అయితే ..?

కష్టాల క్రౌర్యానికి తలొగ్గనా?

నోటివిసుర్లకి వడలి వాడిపోనా?

చలువరాళ్ళపై చతికిలపడి నడుం వాల్చనా?

బాధ్యతల కాలచక్రమెక్కి అంతులేని పరుగులిడనా?

అవమానాల అహాన్ని అంగీకరించనా?

ధైర్యం దరిద్రహేతువని గాలికొదిలేయనా?

భయాల ఊడల ఉరి లో ఊపిరి వదలనా?

వివేకంలోనవివవేకాన్ని వినమ్రంగా గౌరవించనా?

ఆ..?

ఏమిటిది? నమ్మకమా? ఇలా లాక్కుపొతున్నది 

కదన కుతూహలం తో అడుగులు కదిలాయి

నీ సంగతి చూస్తానన్టూ ఓటమి మాయమయ్యింది

ఏం? రావా? పంతం పొలిమేరలు చెరుపుతూ చిరునవ్వు నవ్వింది.

పూలు విరిసే విశ్వాస వసంతాలు వస్తున్నావుగా? అని అడుగుతున్నాయి

తప్పటడుగుల కింద రక్తపుటేరులు కొత్త దారులై పారుతున్నాయి

గమ్యాలు మైలురాల్లైయ్యె ప్రస్థానం గజగమనం గా ముందుకుసాగింది

ఆగేదిక ఆవలి వొడ్డునే

Thursday, 29 August 2019

నా తెలుగు


పదం ఏ భాషదైనా 
అర్థం అమ్మభాషలోనే  స్ఫురిస్తుంది..
వాక్యమెవరిదైనా 
భావాన్ని మాతృభాషే బోధపరుస్తుంది

తాళపత్రముల నుండీ 
కాగితముల తో కూడీ
దిక్కుతోచని నవతరానికి గుర్తింపుగా మరల పారాడి
అంతర్జాలయుగ సంకుల సుడిగుండాల పోరాడి

ఆచంద్రతారార్కమైన గత ఘన కీర్తుల శాహితే అస్థిత్వంగా
కుదరదని వదరి చెదరిన సంతతికి తన ఔచిత్యం చూపగా

ఉదయిస్తుంది మన నవకాంతుల కొత్త వెలుగు
తేనెలకు తీపి నేర్పే అమృతవాణి, నా తెలుగు..

Sunday, 4 August 2019

TOO GOOD TO BE TRUE


Too good to be true..
Whom I'm left with after all I've been through

Too good to be true
The invaluable moments I accrue 

Too good to be true
How after a bitter fight we could start anew

Too good to be true
How we met we still have no clue

Too good to be true
No clue when we all so quickly grew

Too good to be true 
How your colours gave me a vibrant hue

Too good to be true
Without you how much I could misconstrue

Too good to be true
But there are few, whose lives we will screw

Saturday, 29 June 2019

ఒరేయ్ మనిషీ.. (చివరి భాగం)


అమ్మ నవ్వు, నాన్న మాట 
భార్య ప్రేమ, పిల్లల ఆట
స్నేహితులతో సరదా సాయంత్రాలు
పెంపుడు కుక్క అనురాగాలు 

వేసవుల్లో శీతల పవనం 
తొలి జల్లుల మట్టి సుగంధం 
చలికాలపు వేన్నీళ్ళు 
వెన్నెల కాంతుల రంగులు 
పొగమంచు పరదాల అందాలు
ఋతురధులైన విహంగబృందాలు

శిఖరాల ఎత్తులూ 
సంద్రాల లోతులు 
లోయల సొగసులు
పచ్చని పచ్చిక బయళ్లు

యెపాటిరా నీ ఆస్తిపాస్తులు?
ఏం గొప్పరా ప్రకృతి కంటే నీ అంతస్తులు?
సాటి రాలేవు నీ  కాల్పనిక పరువులు, ప్రతిష్టలు,
మేటి కాలేవు నీ ఊహలకు పుట్టిన దైవాలు,దేశాలు

ఎలా మరిచావు నీకందొచ్చిన ఈ అద్భుతాలు?
ఏం తక్కువని విడిచావీ మధురానుభవాలు?

క్షణకాలమే ప్రకృతి పెట్టిన ఈ మానవ జీవన భిక్ష
ఎందుకీ డబ్బుగానుగలో డాబైన గుడ్డిపరుగులశిక్ష?

ఒరేయ్ మనిషీ.. కాస్త ఆగు
ఎందుకీ కలుపు మొక్కల సాగు?
ఒకసారి నిన్ను నువ్వే అడుగు 
ఎక్కడికీ గమ్యం లేని పరుగు?