అమ్మ నవ్వు, నాన్న మాట
భార్య ప్రేమ, పిల్లల ఆట
స్నేహితులతో సరదా సాయంత్రాలు
పెంపుడు కుక్క అనురాగాలు
వేసవుల్లో శీతల పవనం
తొలి జల్లుల మట్టి సుగంధం
చలికాలపు వేన్నీళ్ళు
వెన్నెల కాంతుల రంగులు
పొగమంచు పరదాల అందాలు
ఋతురధులైన విహంగబృందాలు
శిఖరాల ఎత్తులూ
సంద్రాల లోతులు
లోయల సొగసులు
పచ్చని పచ్చిక బయళ్లు
యెపాటిరా నీ ఆస్తిపాస్తులు?
ఏం గొప్పరా ప్రకృతి కంటే నీ అంతస్తులు?
సాటి రాలేవు నీ కాల్పనిక పరువులు, ప్రతిష్టలు,
మేటి కాలేవు నీ ఊహలకు పుట్టిన దైవాలు,దేశాలు
ఎలా మరిచావు నీకందొచ్చిన ఈ అద్భుతాలు?
ఏం తక్కువని విడిచావీ మధురానుభవాలు?
క్షణకాలమే ప్రకృతి పెట్టిన ఈ మానవ జీవన భిక్ష
ఎందుకీ డబ్బుగానుగలో డాబైన గుడ్డిపరుగులశిక్ష?
ఒరేయ్ మనిషీ.. కాస్త ఆగు
ఎందుకీ కలుపు మొక్కల సాగు?
ఒకసారి నిన్ను నువ్వే అడుగు
ఎక్కడికీ గమ్యం లేని పరుగు?