వసుధైక కుటుంబం మా సంస్కారం
మా కులం వాడికే ఇల్లు అద్దె కు ఇస్తాం..
ఆధునిక వైజ్ఞానిక దృక్పథం మాది
ICU లో ఉన్నా మా కులపోడి రక్తమే ఎక్కించుకుంటాం..
డబ్బు మింగే ఇనప హుండీ జాతి ఏంటి అని అడగదిక్కడ. పూజ నేనూ చేస్తానంటే దారం దారివ్వదు..
మా తాతలు నేతులు తాగేవారని
అరువు తెచ్చిన నెయ్యి మూతికి పూసుకుని వాసన చూడమంటాం..
కులాల కీకారణ్యపు కొండచిలువలను
మతాల ముసుగు లో మృగాలను ఏరి కోరి ఎన్నుకుని నాయకులంటాం..
తప్ప తాగి బండి నడిపి దెబ్బ తగిలితే రోడ్ ని తిడతాం... మందు ఇప్పించి మత్తు ఎక్కించి ఓటు వేయించుకున్నోన్ని దేవుడంటాం..
తాగింది దిగాక..
జరిగింది తెలిసాకా..
పీకేది లేక మమ్మల్ని మేమె తిట్టుకుంటాం
ఇంటి పేరు చూసి ఓటు వేస్తాం..
మాకు లేని ఇంగితం వాడిలో ఎందుకుంటుంది
నాయకులూ విసిరేసిన ఎంగిలాకుల్లో ఆర్ధిక ప్రగతిని వెతుక్కుని లెఖ్ఖలేసుకుంటాం..
మాది ప్రజాస్వామ్యం నిగూఢమైన మా అజ్ఞానపు విరాట్ రూపం
విజ్ఞత ఉంది.. విజ్ఞానం ఉంది..
రాళ్ళ పూజ తర్వాతే రాకెట్నైనా పైకి పంపిస్తాం..
ఉపగ్రహాల సైన్యం ఉన్న..
గ్రహణం వస్తే పస్తుంటాం..
సైన్స్ పుట్టిల్లు మా పెరడే..
వాస్తు నప్పలేదని తీసేసాం..