వేడి తో వెలుగుతో నలుదిక్కులకు వన్నెలద్దే సూర్యుడు
చల్లని చీకటిలో చిక్కటి కలలను కమ్మగా కనమనే చంద్రుడు
వస్తూ వస్తూ వాన పాటలుపాడే మేఘం
వెలుగునీడలెన్ని మారినా మరక పడని మడమ తిప్పని ఆకాశం
కెరటాల హోరుతో హృదయం ఉరకలేత్తించే సముద్రం
ఏ బంధం లేకున్నా నవ్వుతూ పలకరించే పువ్వులు
అడగకుండానే ఆకలి తీర్చి నీడనిచ్చే చెట్లూ
రాతి గుండెల పర్వతాలు గుట్టుగా పాడుకునే వాగుల రాగాలు
ఆ వాగుల బృందగానంలో పుట్టి లయలకు హొయలు నేర్పే జలపాతాలు
పదిమందికి అన్నం పెట్టి కడుపు నింపే పంటపొలాలు
పరిపరి విధాల ప్రేమ చూపే ప్రకృతి తోడుగా ఉండగా
నాకింకేం కావాలి అంటే నొచ్చుకుంటుందీ మానవ ప్రపంచం
ప్రకృతిని నంమ్మినంత నిన్ను నమ్మలేను రా మనిషీ అంటే పాపం నామోషీ
ఎలా వేగుతాను ఎక్కడ ఇముడుతాను?
స్వరాలంకార నియమాలు బంధించలేని సాహిత్యం నా జీవితగీతం
కులమతాల చిల్లర తెరలు తీసిపారెసిన తిరుగుబాటు నా నైజం
దేశ ప్రాంత సమాజాల జాలాలకు అతీతమైన విశ్వమానవ తత్వం నా భావం
సిలెండర్ల లో నింపిన స్వేచ్ఛావాయువు కృత్రిమ స్వాసగా పీలుస్తూ
డబ్బు జబ్బు గబ్బు కొట్టే గుడ్డి సమాజపు కమర్షియల్ కారగారం లో జీతాల ఖైదీగా మనలేని అసమర్ధత నా నైపుణ్యం
నియమాల ఇనుప గొలుసులకు తలొగ్గని క్రూరమృగం నా మనోగతం
అర్ధం కాదు నీకు నా మతం
అర్ధం లేనిది నీకు నా మనస్తత్వం
'అర్ధ'మివ్వనిది నా పధం
నేనొక పదం లేని నిర్వచనం
అనిమిత్త విశ్వం లో అనవసర ప్రహసనం
నాతోనే నేను
నాలోనే నేను
నాకోసమే నేను
నీకు బానిస కాలేను
- KMV