వేడిలో వుక్కతో బరువులెత్తే పని కాదు
చెమట నెత్తురు చిందించాల్సిన అవసరం లేదు
రాళ్ళ మధ్యన తవ్విన చీకటి గని కాదది
చలువరాతి మేడలలో కాంతులీనే గది
చిరిగిన బట్టలు నెత్తిన తట్టలు లేవు
రోజు కూలి కోసం పడిగాపులు ఉండవు
ఒకడి కష్టం అందరూ పంచుకునే సఖ్యత ఉండదు
ఒక మాట పై అందరూ నిలబడే ఐక్యత కనపడదు
వెట్టిచాకిరి కి వానిటీ(Vanity) సాంగత్యం
కొత్త బట్టలేసుకొచ్చింది అదే పాత బానిసత్వం
కార్పొరేటు కొండచిలువల తెలివైన లూఠీ
చదువెక్కిన గానుగెద్దులకు ప్రోడక్టివిటీ పోటీ
రాబందు రెక్కల నీడన అంతబాగుందనుకుంటూ
ఇదిగాక మరేదీ చేతకాదనుకుంటూ
అన్యాయాన్ని మౌనంగానే భరిస్తూ
వినమ్రత లో నీ స్వేచ్ఛను నీవే హరిస్తూ
కాలరు రంగు మారిన కార్మికుడా
కార్పొరేటు ముసుగు చాటు శ్రామికుడా
సాకాహారి ని సింహం తినదనుకునే అమాయకుడా
శ్రమదోపిడిని ఎదిరించలేని సైనికుడా
తలవంచుకు బతికేస్తావా
తిరగబడి ఎదిరిస్తావా