ఆదర్శాల ఆకలి కేకలు తూర్పున వినపడుతున్నాయి
నీతులు త్రేన్చే ముసుగు నిజాలు పస్చిమాన కనపడుతున్నాయి
గుంటనక్కల నాయకత్వం లో పిచ్చికుక్కలు మొరుగుతున్నాయి
చలిచీమలు పొట్ట చేతబట్టుకు భయంగా పరిగెడుతున్నాయి
అమాయకపు అడవిని నాగరికత ముంచేస్తోంది
సతత హరిత వనాలను డబ్బు నిప్పు కాల్చేస్తోంది
హిమశిఖరాగ్రం పై వేడి గాలి వీస్తోంది
గొంతెండిన జీవనది మెల్లగా ఆవిరౌతోంది
ఇమడలేక భూగోళం వెర్రిగా తిరుగుతోంది
నేతల కొత్త గీతల తో ప్రపంచపటం చిరుగుతోంది
గుడ్డి న్యాయదేవత గొంతు పై కత్తి గాటు పెట్టింది
దారి దొంగల నిలువుదోపిడి బాటసారిని భయపెట్టింది
మరో ప్రపంచపు వెతుకులాటలో ఆశయం అలిసిపోయింది
గుడ్డ మూటల దాచిన ధైర్యం కరిగి నీరై కారిపోయింది
మనిషి పోటు కి మానవత్వం వెన్నువిరిగి చచ్చింది
మొండి నిద్ర నుండి మెదడు మెలకువలోకొచ్చింది
మరో ప్రపంచం ఆదర్శధామం ఊహాజనితమని చెప్పింది
చెమర్చిన కళ్లు తుడిచి ప్రపంచం సాయమడిగింది
నువ్వు బ్రతుకుతున్న ప్రపంచం సరిచేయమని ఆదేశించింది
కవి కంట నీరు తొణికి కలమంచున కవితయింది