కష్టాల ముల్ల కంపలు కదలనివ్వమంటున్నాయి
నోళ్ళు విసిరే వడగాళ్లు మొఖాన మట్టి కొడుతున్నాయి
వేడి లేని చలువరాతి దార్లు వెనక్కి రమ్మంటున్నాయి
ఆకలితో బాధ్యతలు భోరుమంటున్నాయి
అవమానాల అడ్డంకులు అపహసిస్తున్నాయి
గుండెధైర్యం గాడితప్పి గాలిలోకలిసిపోతోంది
దెయ్యాల మర్రిలా భయం ఊడలు చాచి ఉరేస్తానంటోది
ఓటమి వద్దని వారిస్తోంది
ఒక్క నిముషమాలోచించమని వివేకం కూడా వాదిస్తోంది
అయితే ..?
కష్టాల క్రౌర్యానికి తలొగ్గనా?
నోటివిసుర్లకి వడలి వాడిపోనా?
చలువరాళ్ళపై చతికిలపడి నడుం వాల్చనా?
బాధ్యతల కాలచక్రమెక్కి అంతులేని పరుగులిడనా?
అవమానాల అహాన్ని అంగీకరించనా?
ధైర్యం దరిద్రహేతువని గాలికొదిలేయనా?
భయాల ఊడల ఉరి లో ఊపిరి వదలనా?
వివేకంలోనవివవేకాన్ని వినమ్రంగా గౌరవించనా?
ఆ..?
ఏమిటిది? నమ్మకమా? ఇలా లాక్కుపొతున్నది
కదన కుతూహలం తో అడుగులు కదిలాయి
నీ సంగతి చూస్తానన్టూ ఓటమి మాయమయ్యింది
ఏం? రావా? పంతం పొలిమేరలు చెరుపుతూ చిరునవ్వు నవ్వింది.
పూలు విరిసే విశ్వాస వసంతాలు వస్తున్నావుగా? అని అడుగుతున్నాయి
తప్పటడుగుల కింద రక్తపుటేరులు కొత్త దారులై పారుతున్నాయి
గమ్యాలు మైలురాల్లైయ్యె ప్రస్థానం గజగమనం గా ముందుకుసాగింది
ఆగేదిక ఆవలి వొడ్డునే